దక్షిణాది సినిమాల జోరు కారణంగా బాలీవుడ్ కాస్త వెనుకబడినట్టు కనిపిస్తున్నా మళ్లీ పుంజుకుంటుందని ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ అన్నారు. ఇటీవలి కాలంలో బాలీవుడ్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన కొన్ని చిత్రాలు నిరాశపరచడం, అదే సమయంలో దక్షిణాది సినిమాలు దేశవ్యాప్త మార్కెట్‌ను చేజిక్కించుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ మాట్లాడుతూ బాలీవుడ్ కథ ముగిసిపోయిందనే చెత్త వ్యాఖ్యానాలు, అభిప్రాయాలను తాను సమర్థించబోనని తెలిపారు. ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తూనే ఉన్నారని ‘గంగూబాయి కథియవాడి’ , ‘భూల్ భులయ్యా’ వంటి చిత్రాల విజయాలను గుర్తు చేశారు. గత నెలలో విడుదలైన ‘జుగ్‌జుగ్ జీయో’ మూవీ కూడా మంచి వసూళ్లనే సాధించిందని చెప్పారు.
అయితే దక్షిణాది నుంచి వచ్చి విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘పుష్ప’ , ‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్2’ సినిమాల విజయాల హోరులో బాలీవుడ్ సినిమాల సక్సెస్‌లుకనిపించడం లేదని కరణ్ జోహార్ అన్నారు. అయితే బాలీవుడ్ స్టార్ హీరోలైన షారుక్‌ఖాన్, అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్‌లు నటించిన చిత్రాలు విడుదలైతే ఈ పరిస్థితి ఖచ్చితంగా మారుతుందన్నారు. ‘లాల్ సింగ్ చడ్డా’, ‘బ్రహ్మాస్త్ర’, ‘రక్షాబంధన్’ వంటి భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాలీవుడ్‌కు మళ్లీ విజయాల వెలుగులు అందిస్తాయని కరణ్ జోహార్ విశ్వాసం వ్యక్తం చేశారు. తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ కూడా ప్రేక్షకులు మెచ్చే చిత్రమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బాలీవుడ్‌లో పలు విజయవంతమైన రూపొందించిన కరణ్ జోహార్ మంచి వ్యాపారవేత్త కూడా. ఆయన ‘బాహుబలి’ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేసి, అద్భుతమైన ప్రమోషన్లతో అక్కడ ఆ చిత్ర విజయంలో తాను కూడా భాగమయ్యారు. అంతేకాదు.. ఆ చిత్రం ద్వారా మంచి లాభాలనూ సంపాదించారు. ఆయన నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’ షోకు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో విశేష ఆదరణ ఉంది.