ఇటీవలి కాలంలో వరుసగా ఇండియన్ బాక్సాఫీసుపై దండయాత్ర చేస్తున్న దక్షిణాది సినిమాల దెబ్బకు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్న బాలీవుడ్ హీరోలకు, నటులకు.. హీరోయిన్ కంగనా రనౌత్ మాటలు పుండుపై కారం చల్లినట్టుగా ఉంటున్నాయని చెప్పాలి. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండే ఈ భామ బాలీవుడ్ హీరోలపై కోపమో లేక దక్షిణాది హీరోలపై సాఫ్ట్ కార్నరో తెలియదు గానీ ఉత్తరాది, దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో సౌత్ హీరోలనే సమర్థిస్తుండటం ఆసక్తి కలిగిస్తున్న విషయం. ఆమె వైఖరి అక్కడి ఇండస్ట్రీ ప్రముఖులకు మంట పుట్టిస్తోందని చెప్పాలి.
తన అప్ కమింగ్ మూవీ ‘ధాకడ్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఆమె తాజాగా ఓ ఇంగ్లీషు పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చారు ఈ బోల్డ్ బ్యూటీ. ఈ సందర్భంగా నెపోటిజంపై మరోసారి విరుచుకుపడ్డ కంగనా టాలెంట్ తో పాటు అన్ని అర్హతలున్నవారికంటే స్టార్ కిడ్స్ కే బాలీవుడ్లో ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయన్నారు. ఉత్తరాది సినిమాలపై దక్షిణాది సినిమాలు పైచేయి సాధిస్తుండటానికి ఇది కూడా ఓ కారణమని వ్యాఖ్యానించారు. దక్షిణాదిన తెరకెక్కుతున్న సినిమాలు ప్రేక్షకులకు కనెక్టయ్యాలా ఉంటున్నాయని ఇందుకు ఉదాహరణగా ‘పుష్ప’ మూవీలో హీరో ఓ కూలీగా నటించి మెప్పించడాన్ని గుర్తు చేస్తూ బాలీవుడ్ హీరోలు ఇటీవలి కాలంలో ఇలాంటి పాత్రల్లో కనిపించారా..? అని ప్రశ్నించారు.
బాలీవుడ్లో ఈ మధ్య వస్తున్న సినిమాల్లో ఎక్కువగా స్టార్ కిడ్సే నటిస్తున్నారని, వారిలో ఎక్కువమంది ఫారిన్లో చదువుకుని, వెస్ట్రన్ కల్చర్‌కు అలవాటు పడినవారేనన్న కంగనా.. ఏకంగా వారి లుక్స్ ఉడకబెట్టిన కోడిగుడ్డులా ఉంటున్నాయని, ఇకవారితో ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అవుతారని పెద్ద సెటైరే వేసేశారు. దక్షిణాది సినిమాల్లో సంస్కృతి, సంప్రదాయాలకు ఇప్పటికీ పెద్ద పీట వేస్తున్నారని, అందుకే ఉత్తరాది ప్రేక్షకుల నుంచి కూడా ఆ సినిమాలకు విశేషమైన ఆదరణ లభిస్తోందని తేల్చిచెప్పారు కంగనా. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలపై బాలీవుడ్ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.