Devara Review: దేవర రివ్యూ : ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో యాక్షన్ థ్రిల్లర్ హిట్టా?

నటీనటులు                     : ఎన్టీఆర్‌, జాన్వీ క‌పూర్, సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, శృతి మరాఠే, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ తదితరులు
దర్శకత్వం, స్క్రీన్ ప్లే    : కొరటాల శివ
నిర్మాతలు                       : మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్
సంగీత దర్శకుడు          : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ                : ఆర్.రత్నవేలు
విడుదల తేదీ                 : సెప్టెంబర్ 27, 2024

జూ.ఎన్టీఆర్‌ (Jr. NTR) కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా ‘దేవర’(Devara). జాన్వీకపూర్‌ (Janhvi  Kapoor)  కథానాయిక. సైఫ్ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటించాడు. కాగా భారీ అంచనాల నడుమ ఈ రోజు సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్ళి చూద్దాం.

ఎన్టీఆర్ అభిమానుల ఆరేళ్ల (6 Years) నిరీక్షణకు తెరపడింది. ఆయన సోలో హీరోగా నటించిన ‘దేవర’ (Devara) మూవీ ఎట్టకేలకు ఈరోజు (సెప్టెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, ఆచార్య లాంటి ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కలిసి చేసిన సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘దేవర’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది? ఎన్టీఆర్ కు ఇండస్ట్రీ హిట్ పడిందా? కొరటాల శివకు భారీ బ్రేక్ వచ్చిందా?  రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. ఆంధ్ర – తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు బైర( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప( శ్రీకాంత్), కుంజర(షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర నిర్ణయించుకుంటాడు. దేవర మాట కాదని బైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా… దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర (వరద – ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైర మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం( జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్ స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ.

ప్లస్ పాయింట్స్:

ఎప్పటిలాగే, దేవర, వరద పాత్రల్లో కూడా ఎన్టీఆర్‌ అద్భుతంగా నటించాడు. ద్విపాత్రాభినయంలో తారక్ అభినయం మొత్తం సినిమాకే మెయిన్ హైలైట్. ‘ధైర్యంతో బతికే వాళ్లకు భయాన్ని పుట్టించే వ్యక్తి’గా ఎన్టీఆర్‌ నటించిన విధానం, నిజంగా ఆ స్థాయిలోనే ఉంది. ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి సినిమా కోరుకుంటున్నారో, ఈ సినిమా అలాగే భారీ విజువల్స్ మరియు ‘వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్’ తో సాగింది. ఇక వాటికి తగ్గట్టుగానే తన పాత్రల్లో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ, తన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఎన్టీఆర్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.

దేవర’తో తెలుగు తెరకు పరిచయం అయిన జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) తన ‘తంగం’ పాత్రలో చాలా బాగా నటించింది. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కూడా ‘భైర’ పాత్రలో జీవించాడు. సైఫ్‌ పాత్రలోని డెప్త్ ఆకట్టుకుంది. ఎన్టీఆర్‌ పాత్రకు దీటుగా ఆయన పాత్రను కొరటాల శివ తీర్చిదిద్దారు. మరాఠీ నటి శ్రుతి మరాఠే చాలా బాగా నటించింది. ఆమె స్రీన్ ప్రెజెన్సీ కూడా చాలా బాగుంది. ఇతర కీలక పాత్రల్లో కనిపించిన శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ఆకట్టుకున్నారు. అదేవిధంగా షైన్ టామ్ చాకో, అజయ్ మరియు మిగిలిన నటీనటులు కూడా అయా పాత్రల్లో తమ నటనతో మెప్పించారు.

1980-90 నేపథ్యంలో ఈ మూవీ సాగినా.. కమర్షియల్‌ మూవీకి అనుగుణంగానే భిన్నమైన కాన్సెప్ట్ తో దీన్ని తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్  లో అండ్ ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే అండర్‌ వాటర్‌ సీక్వెన్సెస్ సినిమాకే ప్రధాన హైలైట్‌. ఆ వాటర్‌ సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ నటన కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. ముఖ్యంగా షార్క్‌ షాట్స్ చాలా బాగున్నాయి. దానికి తగ్గట్టుగానే సముద్రంలో నడిచే యాక్షన్ సీక్వెన్స్‌ లను ఎఫెక్టివ్ గా డిజైన్‌ చేశారు. పైగా 90ల కాలంనాటి పరిస్థితులకు అనుగుణంగా పాత్రల చిత్రీకరణతో పాటు ఆ పాత్రల నేపథ్యాన్ని కూడా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశారు. కీలక సన్నివేశాల్లోని కలర్‌ టోన్‌ చాలా బాగా ఆకట్టుకుంది. ఇక దేవర పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో నడిచే సస్పెన్స్‌ బాగుంది. పార్ట్ -2 కి లీడ్  ఇస్తూ కథను ముగించారు.

మైనస్ పాయింట్స్:

బరువైన ఎమోషన్స్ తో, భారీ విజువల్స్ తో వచ్చిన ఈ ‘హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్’ చాలా వరకు బాగా ఆకట్టుకున్నా.. కథనం పరంగా వచ్చే కొన్ని సీన్స్ సినిమా స్థాయికి తగ్గట్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే సినిమాలో ఉన్నంత హైప్ ను సినిమా మొత్తం కంటిన్యూ చేయలేక పోయారు. ఇక జాన్వీ కపూర్ – ఎన్టీఆర్ ల మధ్య లవ్ ట్రాక్ కూడా ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది.

మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కీలక సన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు కొరటాల శివ, మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం తను అనుకున్న ఎమోషనల్ డ్రామానే ఎలివేట్ చేయటానికే ఆసక్తి చూపారు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రాఫర్‌ ఆర్‌.రత్నవేలు సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని కీలక సన్నివేశాలతో పాటు మిగిలిన యాక్షన్ సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా అద్భుతంగా చిత్రీకరించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. ఇక సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సమకూర్చిన పాటలు చాలా బాగున్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా బాగుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. కొరటాల శివ రచయితగా దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, బలమైన వైవిధ్యమైన పాత్రలతో చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. కానీ, కొన్నిచోట్ల ఆయన కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. నిర్మాతలు మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.

తీర్పు :

విజువల్ వండర్ గా సాగిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో.. వైల్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫీల్ గుడ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పవర్ ఫుల్ నటన, కొరటాల దర్శకత్వం, మొత్తం సాంకేతిక విభాగం నుంచి అందిన మంచి పనితనం.. మొత్తం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కానీ, కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, లవ్ స్టోరీ కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడం వంటి అంశాలు మైనస్ అయ్యాయి. ఐతే, ఎన్టీఆర్ తన నటనతో, తన డైలాగ్ మాడ్యులేషన్ తో ఈ సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. ఓవరాల్ గా ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానులతో పాటు మిగిలిన అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా అలరిస్తుంది.