శారీరక అందం కోసం తాపత్రయం ఆమె ప్రాణాలు తీసింది. ఆత్మ విశ్వాసంతో ఉంటే అందం రెట్టింపు అవుతుందన్న విషయాన్ని విస్మరించి ఇరవై ఏళ్లకే ఈ లోకం విడిచింది.
అందమైన ఆకృతి కోసం ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించిన యువ కన్నడ టీవీ నటి, 21 ఏళ్ల చేతన రాజ్ ప్రాణాలు కోల్పోయింది. బెంగళూరు ప్రైవేటు హాస్పిటల్ లో సర్జరీ చేయించుకున్న తర్వాత ఆమె ప్రాణాలు పోగొట్టుకుంది. ఫ్యాట్ ఫ్రీ సర్జరీకి అంగీకారం తెలిపి, మే 16న ఉదయం శస్త్రచికిత్స కోసం ఆమె ఆసుపత్రిలో చేరింది. సర్జరీ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించింది. సాయంత్రానికి ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి, పరిస్థితి మరింత విషమించగా, వైద్యులు తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ప్లాస్టిక్ సర్జరీ విషయాన్ని చేతన తన తల్లిదండ్రులకు చెప్పకుండా.. స్నేహితులతో కలసి ఆమె ఆసుపత్రికి వెళ్లినట్టు సమాచారం. వైద్యుల నిర్లక్ష్యమే తమ కుమార్తె అకాల మరణానికి కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. పోస్ట్ మార్టమ్ కోసం చేతన మృతదేహాన్ని రామయ్య హాస్పిటల్ కు తరలించినట్టు తెలుస్తోంది. పోలీసులు హాస్పిటల్ కు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు.