సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 2005లో ప్రేక్షకుల ముందుకువచ్చిన చంద్రముఖి చిత్రం సాధించిన సంచలన విజయం అంత త్వరగా ఎవరూ మరచిపోలేరు. పి. వాసు దర్శకుడిగా జ్యోతిక టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం అటు తమిళనాట, ఇటు తెలుగులోనూ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిపోతున్న నయనతారకు కెరీర్ ప్రారంభంలో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమాగా కూడా దీనిని చెప్పుకోవాలి. 17 సంవత్సరాల తరువాత దానికి సీక్వెల్ తీసేందుకు భారీ చిత్రాల నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సిద్ధమైన విషయం తెలిసిందే.
పి. వాసు దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న చంద్రముఖి-2 చిత్రంలో రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తుండగా లక్ష్మీమీనన్ హీరోయిన్గా కనిపించనున్నారు.
ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ను మైసూర్లో ముగించినట్టు చిత్ర బృందం అప్డేట్ ఇచ్చింది. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.