Gold:రూ. 80 వేలు దాటేసిన బంగారం.. వెండి కూడా అదే దారిలో..

మన దేశంలో వెండి, బంగారంతో ఉండే ఆ లింక్ కల్చర్ తో ముడిపడి ఉంది. బంగారం అంటే మగువలకు మక్కువ ఎక్కువ. బంగారం కొనకుండా ఉండలేని స్థితి. కాని పుత్తడి ధర మాత్రం ఆకాశాన్ని అంటుతోంది. తాజా మళ్లీ పెరిగింది. వెండి ధర కూడా వేగంగా పెరుగుతోంది. అందులోను పండుగ సీజన్ కావడంతో బంగారం ధర  నిన్న రూ. 80 వేల మార్కును దాటేసింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ. 750 పెరిగి రూ. 80,650 వద్ద స్థిరపడింది.  కిలో వెండిపై ఒకే రోజు రూ. 5 వేలు పెరిగి రూ. 99,500కు ఎగబాకింది. నేడో, రేపు ఇది లక్ష రూపాయల మార్కును చేరే అవకాశం ఉంది. నాణేల తయారీతోపాటు పారిశ్రామిక వర్గాల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగానే వెండి ధర అమాంతం పెరిగినట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

బంగారం, వెండి ధరలు రికార్డుస్థాయికి చేరుకోవడంతో కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందని ట్రేడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి బడ్జెట్‌లో బంగారంపై సుంకాన్ని తగ్గిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకోవడంతో ధరలు 7 శాతం వరకు తగ్గాయి. అయితే, అది మూణ్నాళ్ల ముచ్చటే అయింది.  డిమాండ్-సప్లై మధ్య అంతరం పెరగడం, గనుల్లో ఉత్పత్తి పడిపోవడం, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ అధికంగా ఉండడం, పలు దేశాల్లో కరెన్సీలు బలోపేతం కావడం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు వంటి కారణంగానే ధరలు పెరుగుతున్నట్టు బులియన్ వర్గాలు చెబుతున్నాయి.