విశ్వాన్వేషణలో చరిత్రాత్మక ఘట్టానికి సోమవారం శ్రీకారం చుట్టుకోనుంది. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చందమామపైకి మళ్లీ మనిషిని పంపే బృహత్తర కార్యక్రమంలో తొలి అడుగు పడనుంది. గతంలోలా నామమాత్రపు సందర్శనలతో సరిపుచ్చకుండా జాబిలిపై శాశ్వత ఆవాసానికి పునాదుల కోసం శాస్త్రవేత్తలు ఈసారి కసిగా ఉన్నారు. అంతరిక్షంలో సుదూర ప్రాంతాల దిశగా మానవులకు బాటలు వేయనుంది. ఆర్టెమిస్-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళతాయి. చందమామను చుట్టివచ్చే ఈ స్పేస్‌షిప్‌లో వ్యోమగాములు ఉండరు. తదుపరి ప్రయోగాలు మాత్రం మానవసహితంగానే సాగుతాయి.
1960లలో చందమామపైకి మానవసహిత యాత్రలు నిర్వహించడానికి అమెరికా ‘అపోలో’ ప్రాజెక్టును చేపట్టింది. అయితే నాడు సైన్స్ పరిశోధనల కోసం కాకుండా సోవియట్ యూనియన్‌పై పైచేయి సాధించడమే లక్ష్యంగా అగ్రరాజ్యం వీటిని నిర్వహించింది. జాబిలిపైకి 1969లో మొదలైన మానవసహిత యాత్రలు 1972లో ముగిశాయి. ఏ యాత్రలోనూ వ్యోమగాములు మూడు రోజులకు మించి చందమామపై గడపలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. భూకక్ష్యకు వెలుపల లోతైన పరిశోధనలు చేయాలన్న ఆసక్తి పెరిగింది. చందమామ, అంగారకుడు, ఆ వెలుపలి ఖగోళ వస్తువులపై కాలనీల ఏర్పాటుకు పరిశోధకులు సిద్ధపడుతున్నారు.
ఇందులో భాగంగా వచ్చే పదేళ్లలో జాబిలిపై దీర్ఘకాల ఆవాసాలను ఏర్పాటు చేయాలని నాసా భావిస్తోంది. వంతులవారీగా వ్యోమగాములను అక్కడ ఉంచాలనుకుంటోంది. చంద్రుడి ఉపరితలం నుంచి నీరు, ఇతర వనరులను ఒడిసిపట్టాలనుకుంటోంది. అంతిమంగా అంగారకుడిపై కాలనీలు ఏర్పాటు చేయడానికి ఈ ఫలితాలు దోహదపడతాయని భావిస్తోంది. ఈ దిశగా అర్టెమిస్-1 విజయం పునాదులు వేస్తుంది. ఈ ప్రాజెక్టులో ప్రధానంగా స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్‌ఎల్‌ఎస్) అనే రాకెట్, ఒరాయన్ అనే క్యాప్సూల్ ఉన్నాయి.
ఒరాయన్
ఎస్‌ఎల్‌ఎస్ పైభాగంలో ఒరాయన్ క్యాప్సూల్ ఉంటుంది. ఇందులో నలుగురు వ్యోమగాములు ప్రయాణించడానికి అవకాశం ఉంది. మరో వ్యోమనౌకకు అనుసంధానం కావాల్సిన అవసరం లేకుండానే ఏకబిగిన 21 రోజుల పాటు చంద్రుడి కక్ష్యలో ఇది పనిచేయగలదు. ఇందులో వ్యోమగాములు కూర్చునే క్రూ మాడ్యూల్ కీలకం. రోదసి యాత్రలకు సంబంధించిన సంక్లిష్ట పరిస్థితులను తట్టుకొనేలా దీన్ని తయారుచేశారు. క్రూ మాడ్యూల్‌కు ఐరోపా నిర్మించిన సర్వీసు మాడ్యూల్ ఉంటుంది. అది ఇంధనం, శక్తిని అందిస్తుంది. దానికి సౌరఫలకాలు ఉంటాయి.
యాత్ర ఇలా..
ఆర్టెమిస్-1 యాత్ర ఆరు వారాల పాటు సాగుతుంది. ఫ్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఎస్‌ఎల్‌ఎస్ నింగిలోకి దూసుకెళుతుంది. నిర్దేశిత సమయం తర్వాత రాకెట్‌తో ఒరాయన్ విడిపోతుంది. చంద్రుడి దిశగా సాగే ‘ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్’ పథంలోకి వెళుతుంది.
జాబిలిపైకి మలి యాత్రలో తొలి అడుగు
- 3.86 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిని చేరుకోవడానికి ఒరాయన్‌కు దాదాపు వారం పడుతుంది. తొలుత చంద్రుడి ఉపరితలానికి ఎగువన 100 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేరుతుంది.
- ఆ తర్వాత 61వేల కిలోమీటర్ల దూరంలోని సుదూర కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఆ దశలో అది భూమికి 4.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అపోలో యాత్రలో ఇంత దూరం వెళ్లలేదు. ఈ దశలో ఒరాయన్‌లో వ్యోమగాములు ఉంటే భూమి, చంద్రుడిని ఒకేసారి చూడొచ్చు.
- భూమికి తిరిగి రావడానికి ఒరాయన్.. చంద్రుడి గురుత్వాకర్షణను ఉపయోగించుకుంటుంది. ఈ వ్యోమనౌక.. గంటకు 40వేల కిలోమీటర్ల వేగంతో భూమి వాతావరణంలోకి దూసుకొస్తుంది. ఆ దశలో గాలి రాపిడి వల్ల ఒరాయన్‌పై 2,750 డిగ్రీల సెల్సియస్ మేర వేడి ఉత్పత్తవుతుంది. దీన్ని తట్టుకునేలా ఆ వ్యోమనౌకకు ప్రత్యేక ఉష్ణరక్షణ కవచాన్ని ఏర్పాటు చేశారు.
- ఈ యాత్ర ఫలితాలు కొంతవరకు అవగాహనకు వచ్చాక.. చందమామపై మానవ నివాస యోగ్యమైన వాతావరణం ఉంటుందా? లేదా? అనే అంశంపై ఖగోళ శాస్త్రవేత్తలు ఓ అంచనాకు వస్తారు.