అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో ఐదు శాతం లేదా 11 వేల మందిపై నేడు వేటు వేయనుందని అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి. వారంతా మానవ వనరులు (హెచ్ఆర్), ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులని తెలిపిపాయి. కంపెనీలో గత జూన్ 30 నాటికి మొత్తం 2 లక్షల 21 వేల మంది పూర్తిస్థాయి ఉద్యోగులు ఉన్నారు. వారిలో 1 లక్షా 22 వేల మంది అమెరికాలో పనిచేస్తుండగా, 99 వేల మంది వివిధ దేశాల్లో పనిచేస్తున్నారు. కాగా, మెక్రోసాఫ్ట్ గత అక్టోబర్‌లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 1000 మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే.
ఆర్థిక మాంద్యం భయాలు, డిమాండ్ తగ్గిపోవడంతో అమెజాన్, మెటా సహా అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగా అమెజాన్ రెండు విడుతల్లో సుమారు 30 వేల మంది ఉద్యోగులను తొలగించగా, మెటా 11 వేల మందిపై వేటు వేసింది.
కాగా, క్లౌడ్ సేవల్లో అజూర్‌పై ఎక్కువగా దృష్టిపెడుతుండటంతో మైక్రోసాఫ్ట్‌లో పాత టెక్నాలజీలకు సంబంధించి ఉద్యోగులను తొలగించనున్నట్లు ఇప్పటికే వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఉన్న ప్రపంచవ్యాప్త అమ్మకాల ప్రక్రియను కూడా క్లౌడ్ సర్వీస్‌కు మార్చే ఆలోచనలో సంస్థ ఉన్నది.