అమెరికాలో భారీగా ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు

అనవసర ఖర్చులు తగ్గించేందుకు బడ్జెట్‌లో కోతలు విధించడమే ప్రథమ లక్ష్యమని ప్రకటించిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇది వరకే తన విధానాన్ని సుస్పష్టం చేసారు . ట్రంప్ ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు యూఎస్ లో కసరత్తు మొదలైంది. దీని కోసం ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌; భారత సంతతికి చెందిన బయోటెక్‌ కంపెనీ సీఈవో, రిపబ్లికన్‌ పార్టీ నాయకుడు వివేక్‌ రామస్వామి ఉమ్మడి ఆధ్వర్యంలో ప్రభుత్వ సామర్థ్య విభాగం  ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు . ప్రభుత్వ విభాగాల్లో సామర్థ్యం పెంచడమంటే భారీగా ఉద్యోగాల్లో కోత విధించడమేనని ఈ ఇరువురు సీఈవోలు భావిస్తున్నారు. ఇటీవల ట్రంప్‌ సొంత ఎస్టేట్‌ అయిన మార్‌ ఎ లాగోలో జరిగిన సన్మాన సభలో వివేక్‌ ప్రసంగిస్తూ ‘‘మస్క్‌, నేను కలిసి వాషింగ్టన్‌లోని అధికార యంత్రాంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది ‘ఎన్నిక ద్వారా నియమితులుకాని ఉద్యోగుల’ను బయటకు పంపి వేస్తాం.మేం ఆ పొజిషన్‌లో ఉన్నాం’’అని చెప్పారు.

‘‘మస్క్‌ గురించి మీకు పూర్తిగా తెలియదు. ప్రభుత్వ ఉద్యోగులను తగ్గించడానికి ఆయన పెద్ద కరెంటు రంపమే తెస్తున్నారు. చాలా సరదాగా ఉంటుందిలే’’ అని వ్యాఖ్యానించారు. ఈ ‘కరెంటు రంపం’ ఆలోచనను అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్‌ మిలేయి నుంచి తీసుకున్నట్టు కనిపిస్తోంది. అధికారం చేపట్టిన వెంటనే సాహసోపేత పొదుపు చర్యలు తీసుకుంటానని మిలేయి ప్రకటించారు. ‘ఆర్థిక పోకిరీ’, ‘అరాచక పెట్టుబడిదారుడు’నని స్వయంగా చెప్పుకొన్నారు. అధికార యంత్రాంగం, ఆర్థిక లోటును తగ్గించేందుకు ‘కరెంటు రంపాన్ని’ ఉపయోగిస్తానని ప్రకటించారు. ఆ భావననే వివేక్‌ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ‘క్షవరం’ చేయాల్సి ఉందని ఆయన అన్నారు. ‘‘ప్రభుత్వ యంత్రాంగం సైజును ‘షేవింగ్‌’’ చేయడం మా లక్ష్యం. ఇది మాత్రం సాధ్యమైనంత వరకు పారదర్శంగా జరగాలి’’అని పేర్కొన్నారు.