మనమంతా ఒకేలా ఉండం. అదే శరీరాలలో రకాలుంటాయి. శరీరం నిర్మాణాలు బట్టి మూడు రకాలుగా ఉంటాయని నిపుణుల విశ్లేషణ. అయితే ఆయా రకాల శరీరాల వారు తీసుకునే జాగ్రత్తలు వేరువేరు విధంగా ఉంటాయని చెబుతున్నారు. బరువును తగ్గించుకోవడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. శరీర బరువు ఎన్నో అనర్థాలకు కారణంగా మారింది. ప్రతి సమస్యకు అధిక బరువు కుడిబండగా మారింది. అయితే దానిని తగ్గించుకునే అవగాహన రోజురోజుకూ పెరుగుతోంది. అందులో భాగంగానే మరికొంత తెలుసుకోవాల్సిఉంది. బరువు తగ్గించుకునే ముందు అసలు మనశరీర తత్వం గురించి తెలుసుకోవాలి…
శరీర స్వభావాలు.. బరువు, ఆకారాలను బట్టి మనుషులను స్థూలంగా మూడు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. పొడవుగా, సన్నగా ఉండేవారు (ఎక్టోమార్ఫ్); బలంగా, దృఢంగా ఉండేవారు (మీసోమార్ఫ్).. అధిక బరువు గలవారు (ఎండోమార్ఫ్). సన్నగా ఉండేవారిలో జీవక్రియల వేగం ఎక్కువ. వారిలో కండరాలతో పాటు కొవ్వు కూడా తక్కువగానే ఉంటుంది. కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తిన్నా బరువు అంతగా పెరగరు. దృఢంగా ఉండేవారిలో కండరాల మోతాదు ఎక్కువ. వారు త్వరగా బరువు పెరుగుతారు. కాని కాస్త ప్రయత్నిస్తే తేలికగానే అదుపులో ఉంచుకోవచ్చు. ఇక అధిక బరువు గలవారిలో కేలరీలు అంతగా ఖర్చుకావు. జీవక్రియల వేగం నెమ్మదిగా ఉంటుంది. ఏం తినాలన్నా భయమే.
అధిక బరువు, ఊబకాయాన్ని గుర్తించడానికి కొన్ని కొలమానాలు ఉపయోగపడతాయి. వీటిల్లో నడుము-తుంటి నిష్పత్తి (డబ్ల్యూహెచ్ఆర్) ఒకటి. దీన్ని ఆరోగ్యానికి సూచికగా భావిస్తారు. తుంటి చుట్టుకొలతను నడుము చుట్టుకొలతతో భాగిస్తే వీటి నిష్పత్తి తెలుస్తుంది. మహిళల్లో ఇది 0.85, అంతకన్నా తక్కువగా.. పురుషుల్లో 0.9 కన్నా తక్కువగా ఉండాలి. మరో కొలమానం శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి (బీఎంఐ). ఎత్తును ఎత్తుతో గుణించి (మీటర్లలో).. బరువుతో (కేజీల్లో) భాగించి దీన్ని లెక్కిస్తారు. ఇది 30 కన్నా పెరిగితే ఊబకాయం ఉన్నట్టే. సాధారణంగా యాపిల్ ఆకారం శరీరం గలవారిలో బీఎంఐ 30 కన్నా ఎక్కువగా ఉంటుంది.
అధికబరువుతో.. మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బు వంటివే కాదు.. ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. నడుము-తుంటి నిష్పత్తి 0.8 కన్నా ఎక్కువగా గల మహిళల్లో సంతాన సామర్థ్యమూ తగ్గుతుంది. చాలామందికి చికిత్సలు తీసుకుంటే తప్ప సంతానం కలగకపోవడం గమనార్హం. ఇక పురుషుల విషయానికి వస్తే నడుము-తుంటి నిష్పత్తి 0.9 కన్నా తక్కువగా ఉన్నవారికి సంతానం కలిగే అవకాశం ఎక్కువ. వారికి వృషణాల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశమూ తక్కువే. ఈ నిష్పత్తి ఎక్కువగా గల వృద్ధులకు మరణించే ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టూ కొన్ని అధ్యయనాలు నొక్కి చెబుతున్నాయి.