ఎవరినడిగినా బీట్ చాలా మంచిది అనేస్తారు. బీట్ రూట్ తినండి.. బీట్ రూట్ జ్యూస్ తాగండి అని సలహాయిస్తుంటారు. కాని చాలా మందికి బీట్ రూట్ ఇష్టం ఉండదు. ఆ రుచిని ఆస్వాదించేవారు చాలా తక్కువ. కాని ఆరోగ్యం గురించి ఆలోచిస్తే బీట్ రూట్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. బీట్ రూట్ వల్ల కలిగే ప్రయోజనాలు బోలెడు. ప్రతి ఒక్కరూ రోజూ బీట్ రూట్ ను తీసుకోవడం అంటే.. మెరుగయిన ఆరోగ్యానికి రూట్ మ్యాప్ అంటున్నారు వైద్యులు.
విటమిన్లు, మినరల్స్, ఫైబర్
బీట్ రూట్ లో విటమిన్లు, మినరల్స్ ఎక్కువ.. కాని కేలరీలు మాత్రం తక్కువ. మనకు రోజువారీ కావాల్సిన పరిణామంలో మాంగనీస్ 14 శాతం, కాపర్ 8 శాతం, పొటాషియం 7 శాతం, మెగ్నీషియం 6 శాతం, విటమిన్ సి 4 శాతం, విటమిన్ బీ6 నాలుగు శాతం చొప్పున బీట్ రూట్ లో ద్వారా అందుతాయి. 100 గ్రాముల ఉడికించిన బీట్ రూట్ లో 44 కేలరీలు మాత్రమే. అలాగే ప్రొటీన్ 1.7 గ్రాములు, ఫ్యాట్ 0.20 గ్రాములు, కార్బోహైడ్రేట్స్ 10 గ్రాములు, ఫైబర్ (పీచు) 2 గ్రాములు లభిస్తాయి. ఫొలేట్ అయితే మన రోజువారీ అవసరాల్లో 20 శాతం భర్తీ అవుతుంది.
బీపీ కంట్రోల్..
బీట్ రూట్ లోని సిస్టాలిక్, డయాస్టాలిక్ రక్తపోటును తగ్గించడంలో సాయపడుతుందని పలు అధ్యయనాలు తెలిపాయి. రక్తపోటు వల్ల గుండెకు అధిక రిస్క్ ఎదురవుతోంది. బీట్ రూట్స్ లో నైట్రేట్స్ అధికంగా ఉండడం వల్ల సిస్టాలిక్ బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. ఇది గుండె కవాటాలు మూసుకున్నప్పుడు రక్త ప్రవాహంపై ఉండే ఒత్తిడి. గుండె కవాటాలు తెరుచుకున్నప్పుడు ఉండే రక్తపోటును డయాస్టాలిక్ బ్లడ్ ప్రజర్ గా చెబుతారు. దీనికి సంబంధించి ఉడికించిన బీట్ రూట్ కంటే పచ్చి బీట్ రూట్ మంచిదని వైద్యులు చెబుతున్నారు. అలాగే బీట్ రూట్ లో ఉండే నైట్రేట్లు క్రీడాకారుల్లో సామర్థ్యం పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. కణాల్లో శక్తిని తయారుచేసే మిటోచాండ్రియా సామర్థ్యాన్ని బీట్ రూట్ పెంచుతుంది.
వాపు గుణాలు తగ్గిస్తుంది.
బీట్ రూట్ లో యాంటీ ఇన్ ఫ్లమేషన్ (వాపు) గుణాలు ఉండడంతో క్రానిక్ ఇన్ ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఊబకాయం, గుండె జబ్బు, కాలేయ జబ్బు, కేన్సర్లలో ఇన్ ఫ్లమేషన్ ఉంటుంది. రోజూ 250 మిల్లీ లీటర్ల బీట్ రూట్ జ్యూస్ తీసుకుంటే ఈ ఇన్ ఫ్లమేషన్ తగ్గుతున్నట్టు ఒక అధ్యయనంలో గుర్తించారు.
గ్లూకోజ్ తగ్గుతుంది..
బీట్ రూట్లో ఉండే ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గడానికి దారితీస్తుంది. అంతేకాదు బీట్ రూట్ లో ఉండే విటమిన్ బీ9 కణాల వృద్ధికి సాయపడుతుంది. కేన్సర్ పై పోరాడే బెటైన్, ఫెరూలిక్ యాసిడ్, రూటిన్, కెంఫెరాల్, కెఫీయిక్ యాసిడ్ ఇందులో ఉన్నాయి. బీట్ రూట్ కాన్సర్ కణాల విస్తరణను అడ్డుకుంటున్నట్టు పరిశోధకులు సైతం గుర్తించారు.