అరవై ఏండ్ల బామ్మ ఉన్నట్టుండి పాతికో, ముప్పయ్యో సంవత్సరాల యువతిగా మారితే ఎలా ఉంటుంది. సినిమాలు, కల్పిత కధల నవలల్లోనే ఇది సాధ్యం అంటారా? నిజజీవితంలోనూ ఇది సాధ్యమేనని ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు నిరూపించారు. మనుషుల చర్మంలోని కణాల వయసును ఏకంగా 30 ఏళ్ళు తగ్గించారు. దీంతో వయసు తగ్గింపునకు దశాబ్దాలుగా జరుగుతున్న ప్రయోగాల్లో కీలక ముందడుగు పడినట్లయింది.
వయసు పెరిగేకొద్దీ కణాలు సక్రమంగా పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీంతో ముఖం, చేతులపై ముడతలు వస్తాయి. అయితే, రీజనరేటివ్ బయాలజీ (పునరుత్పత్తి జీవశాస్త్రం) విధానంలో ప్రేరేపిత స్టెమ్ కణాల సాయంతో కేంబ్రిడ్ పరిశోధకులు ఫైబ్రోబ్లాస్ట్స్ కణాల్లోని ప్రొటీన్లను ఉత్తేజితం చేశారు. తద్వారా చర్మంలోని కణాల వయసును తగ్గించారు. గడిచిన దశాబ్దకాలంగా ఈ ప్రయోగం చేస్తున్నట్టు పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ దిల్జీత్ తెలిపారు. ప్రమాదకరమైన వ్యాధులను ఎదుర్కొనేందుకు మనుషుల్లోని జన్యురాశిని పునరుత్తేజం చేసే విధానాన్ని అభివృద్ధి చేయనున్నట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వివరాలు ‘ఈలైఫ్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఏమిటీ ఫైబ్రోబ్లాస్ట్స్?
ఫైబ్రోబ్లాస్ట్స్ అనేవి ప్రత్యేక కణాలు. కణజాలాల మధ్య బంధాన్ని ఏర్పరిచేందుకు సహకరిస్తాయి. ఇందులోని ప్రొటీన్లు నిర్జీవంగా మారుతున్న కణాలను బాగుచేయడం, గాయాలను మాన్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.