- మలాశయ క్యాన్సర్‌ను తరిమికొట్టిన ‘డోస్టర్‌లిమాబ్’
అంతర్జాతీయ వైద్య చరిత్రలో ఓ అద్భుతం చోటుచేసుకొన్నది. కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు తీసుకున్నప్పటికీ, పూర్తిస్థాయిలో నయంకాని క్యాన్సర్ మహమ్మారి.. ఓ ఔషధంతో సమూలంగా మాయమైపోయింది. యావత్తు ప్రపంచ దేశాలూ ఆనందాశ్చర్యాలకు కారణమైన ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకున్నది. ఈ మేరకు అంతర్జాతీయ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం…
ట్రయల్ ఎలా జరిగింది?
మలాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న 18 మంది రోగులకు వైద్యులు ‘డోస్టర్‌లిమాబ్’ అనే ఔషధాన్ని ఇచ్చారు. కోర్సు పూర్తయిన తర్వాత రోగులకు ఎండోస్కోపీ, పీఈటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్‌ను తీయించారు. పురీషనాళంలో ఉన్న క్యాన్సర్ గడ్డ ఆశ్చర్యకరంగా మాయమైంది. ఇతర అవయవాల్లో కూడా క్యాన్సర్ కణాల జాడ కనిపించలేదు. ఫలితాలను ఇతర వైద్యులు కూడా పరీక్షించి ధ్రువీకరించారు. పెద్దమొత్తంలో ట్రయల్స్ నిర్వహణకు ఇప్పుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఏమిటీ దివ్యౌషధం?
ట్రయల్‌లో వినియోగించిన డ్రగ్ పేరు ‘డోస్టర్‌లిమాబ్’. గర్భాశయ క్యాన్సర్ చికిత్సలో భాగంగా దీన్ని కూడా వినియోగిస్తారు. తాజా ట్రయల్‌లో.. రోగనిరోధక వ్యవస్థను తప్పించుకుంటూ తిరుగుతున్న క్యాన్సర్ కణాలను వెలుగులోకి తీసుకొచ్చి, నాశనం చేయడంలో ఈ డ్రగ్ కీలక పాత్ర పోషించినట్టు వైద్యులు తెలిపారు.
ఔషధం ఖరీదు ఎంత?
‘డోస్టర్‌లిమాబ్’ను మూడు వారాల ఎడంతో ఆరు మాసాల పాటు (దాదాపుగా ఎనిమిది డోసులు) ఇచ్చారు. ఒక్కో డోసు ఖరీదు రూ. 8.55 లక్షలు. అయితే, డోసు ఎంత మోతాదులో ఇచ్చారన్న విషయాన్ని పరిశోధకులు వెల్లడించలేదు.
ట్రయల్‌లో పాల్గొన్న ప్రతీ రోగికి క్యాన్సర్ నయమవ్వడం ఇప్పటివరకూ వినలేదు. ప్రపంచంలో ఇలాంటి ప్రయోగం ఇదే మొదటిసారి. ట్రయల్‌లో పాల్గొన్న ఏ ఒక్కరిపై దుష్ప్రభావాలు కనిపించకపోవడం మరో విశేషం.
గతంలోఎన్నో కఠిన పరిస్థితులు
ట్రయల్‌లో పాల్గొనడానికి ముందు క్యాన్సర్ చికిత్స కోసం కీమోథెరపీ, రేడియేషన్, ఇన్‌వేసివ్ సర్జరీ వంటి ట్రీట్మెంట్లను తీసుకున్నట్టు రోగులు తెలిపారు. ఈ చికిత్సలు జరిగేప్పుడు ఎంతో కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్టు గుర్తు చేసుకున్నారు. అయితే, ‘డోస్టర్‌లిమాబ్’ డ్రగ్‌తో క్యాన్సర్ సంపూర్ణంగా మాయమవ్వడం నిజంగా ఆనందాన్నిస్తున్నట్టు వెల్లడించారు.