ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ముందు వరుసలో ఉండే వారెన్ బఫెట్ ఆ స్థాయికి ఎదగడానికి కారణం.. భవిష్యత్తును ఊహించి మంచి కంపెనీల్లో ఆయన ఇన్వెస్ట్ చేయడమే. ఆయనకు చెందిన బెర్క్‌షైర్ హాత్వే కంపెనీకి ఎన్నో బహుళ జాతి కంపెనీల్లో వాటాలు ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు కమోడిటీల్లోనూ ఆయన భారీగా పెట్టుబడి పెడతారు. సిల్వర్ ధర ఓ రెండు దశాబ్దాల క్రితం కిలో రూ. 7 వేలు ఉన్న సమయంలో పారిశ్రామిక అవసరాలకు ఆ లోహం వాడకం పెరుగుతుందన్న అంచనాతో ఆయన దానిని వందల టన్నులు కొనుగోలు చేశారు. ఆ తరువాత కొద్ది కాలానికే దాని ధర పదింతలు పెరిగింది. అందుకే ఇన్వెస్ట్మెంట్ గురుగా ప్రపంచ వ్యాపార రంగంలో ఈయనకు ప్రత్యేక స్థానముంది.
కాగా కొంతకాలంగా ఎవరూ ఊహించలేని స్థాయిలో విలువను సంతరించుకుని, ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృషిస్తున్నక్రిప్టో కరెన్సీపై వారెన్ బఫెట్ తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అతిపెద్ద క్రిప్టో కరెన్సీగా నిలిచిన బిట్‌కాయిన్ లన్నీ తనకు ఇస్తానన్నా వాటిని 25 డాలర్లకు కూడా తాను కొనుగోలు చేయనని ఆయన ఓ ప్రముఖ టీవీ చానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం బిట్ కాయిన్ విలువ 38,712 డాలర్లు పలుకుతోంది. దీని మొత్తం మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటే 73.6 వేల కోట్ల డాలర్లుగా ఉంది. అయితే వారెన్ బఫెట్ దృష్టిలో అదో మార్కెట్ మాయాజాలం అంతే. వాటి వలన ఎవరికీ ప్రయోజనం ఉండదనీ, కొన్నా స్థిరమైన ఆదాయం ఉండదని, ఎవరికో అమ్మి బయటపడాల్సిందేనన్నది ఆయన నమ్మిన సూత్రం.
దానికి బదులుగా అమెరికాలో ఉన్న అపార్ట్మెంట్లలో కాని, లేదా సాగు భూమిలో గాని ఒక శాతం కొనుగోలు చేసేందుకు తాను 25 బిలియన్ డాలర్లనయినా వెచ్చించేందుకు సిద్ధపడతానని బఫెట్ తెలిపారు. ఇళ్ల పైన అద్దెలొస్తాయని, సాగు భూమి ద్వారా పంటలు పండించవచ్చని, కానీ క్రిప్టో కరెన్సీ అనుత్పాదక పెట్టుబడి అన్నది ఆయన అభిప్రాయం. అంతేకాదు.. ఇప్పుడు ప్రపంచాన్ని శాసిస్తున్న మైక్రో సాఫ్ట్ వంటి ఐటి కంపెనీల్లో బఫెట్ పెట్టుబడులేమీ పెట్టలేదు. ఎందుకంటే తాను సాంకేతిక నిపుణుడిని కాదని, కంప్యూటర్ల ముందు కూర్చుని వారు ఏం చేస్తారో తనకు తెలియదని, తనకు తెలియని వ్యాపారం ఎలా ఉంటుందో అంచనా వేయలేను కాబట్టి వాటిలో పెట్టుబడి పెట్టనని గతంలో ఆయన స్పష్టంగా తేల్చి చెప్పారు.
నిజానికి వాటిలో గనుక ఆయన పెట్టుబడులు పెట్టి ఉంటే.. అవి ప్రస్తుతం ఉన్న స్థాయిని బట్టి బహుశా ప్రపంచంలో మరెవరూ కలలోనైనా ఊహించలేనంత సంపద ఆయన సొంతమై ఉండేదేమో. కానీ ఆయన నమ్మిన వ్యాపార సూత్రానికి అది విరుద్ధం. అయితే టెక్నాలజీ బేస్డ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టని వారెన్ బఫెట్ కు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ దక్షత మీద గొప్ప నమ్మకం. అందుకే తన ఆస్తిలో సింహ భాగాన్ని గేట్స్ ఫౌండేషన్ కు విరాళంగా అందించి తనలోని దాతృత్వాన్ని చాటుకున్నారు.