ఉత్తర కొరియాలో కొద్దిరోజులుగా కోవిడ్ వైరస్ అత్యంత ప్రమాదకర స్థాయిలో వ్యాపిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశముందని, ఇది ప్రపంచానికి మరోసారి పెనుముప్పుగా మారవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలో వైద్య, ఆరోగ్య రంగం ఉన్న దుస్థితిని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇందులోని వాస్తవమేంటో అర్థమవుతుంది. కిమ్ లాంటి నియంత పాలనలో మగ్గుతున్న ఉత్తర కొరియాలో వాస్తవ స్థితిగతులేమిటో ప్రపంచానికి ఒకపట్టాన తెలియవు. గతంలో ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి మూడు వేవ్‌ల సమయంలోనూ తమ దేశ ప్రజలు దాని బారిన పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని కిమ్ ప్రభుత్వం చెపుతూ వచ్చింది. అయితే అత్యంత అమానవీయమైన ఆంక్షలు అప్పట్లో ఆ దేశంలో అమలయ్యాయని, మరణాలు సంభవించినా వాటి వివరాలు బయటకు రానివ్వలేదన్న ఆరోపణలు, అనుమానాలు ఉన్నాయి.
అయితే పొరుగున ఉన్న చైనాతో సన్నిహిత సంబంధాలున్న ఈ దేశంలో గడచిన కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్క రోజులోనే 2.3 లక్షల కేసులు కొత్తగా నమోదుకాగా ఆరుగురు చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 17 లక్షలకు పెరిగింది. కోవిడ్ మరణాల సంఖ్య 62కు చేరింది. ఈ దేశంలో ఇప్పటిదాకా కోవిడ్ వ్యాక్సినేషన్ జరగలేదు. వైద్య సౌకర్యాల పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో ఇక్కడ వైరస్ ఉధృతి ప్రమాదకరమైన కొత్త వేరియంట్ల పుట్టుకకు కారణం కావచ్చని, ఇది ప్రపంచ మానవాళికి మరోసారి ముప్పుగా మారవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి, టెడ్రోస్, అత్యవసర విభాగం డైరెక్టర్ మైక్ ర్యాన్ ఆందోళతో కూడిన హెచ్చరికలు జారీ చేశారు. ఇక్కడ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన వ్యాక్సిన్లు, పరీక్ష కిట్లు, ఇతరత్రా సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా వారు తెలిపారు.
అయితే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మాత్రం ఈ సాయాన్ని అంగీకరిస్తారో లేదో తెలియని పరిస్థితి ఉంది. తమ దేశంలోని అధికారుల తప్పిదాలు, ఆలస్యంగా స్పందించడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని చెపుతున్న కిమ్ మరోసారి కఠిన ఆంక్షల ద్వారా ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక కొరియా మిత్ర దేశమైన చైనాలోనూ ఇప్పటిదాకా వైరస్ నియంత్రణకు కఠినమైన ఆంక్షలు అమలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితి కాస్త మెరుగుపడుతుండటంతో షాంఘై వంటి నగరాల్లో ఆంక్షలను పాక్షికంగా సడలిస్తున్నారు.