కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా బయటపడకుండానే పులిమీద పుట్రలా పుట్టుకొచ్చి మానవాళిని కలవరపెడుతున్న వైరస్ మంకీపాక్స్. తొలిసారిగా ఆఫ్రికా దేశాల్లో గుర్తించిన ఈ వైరస్ కేసులు క్రమంగా ప్రపంచమంతా విస్తరిస్తున్నాయి. ఇప్పటివరకూ 65 దేశాల్లో 16 వేలమందికి పైగా దీని బారిన పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ వైరస్ వ్యాప్తిని కలిసికట్టుగా నివారించాలని సూచిస్తూ ఆరోగ్య అత్యయిక పరిస్థితిని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. అయితే ఈ వ్యాధి అంత ప్రమాదకరమైనది కాదని, ఇతరులకు వ్యాపించే అవకాశమూ తక్కువేనని, ప్రజలు అంతగా ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్య నిపుణులు చెపుతున్నారు. వైరస్ బారినపడ్డ రోగిని నాలుగువారాలపాటు ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తే సరిపోతుందని వారు సూచిస్తున్నారు. భారత్‌లోనూ ఇప్పటిదాకా ముగ్గురు వ్యక్తులు ఈ వైరస్ బారినపడ్డారు. ఈ ముగ్గురూ విదేశాలకు వెళ్లి వచ్చిన కేరళకు చెందినవారే కావడం గమనార్హం.