బ్రిటిష్ వలస పాలనకు అవశేషంగా చెప్పదగ్గ భారతీయ శిక్షా స్మృతి లోని 124 ఎ సెక్షన్ రాజద్రోహం చట్టం అమలును నిలుపు చేస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తాము పరిశీలన చేస్తున్నామని చెప్పడంతో తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు ఈ సెక్షన్ కింద ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే నమోదైన కేసులపై చర్యలు చేపట్టవద్దని కూడా పేర్కొంది. అంతేకాకుండా ఈ చట్టం కింద ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నవారు కోర్టులను ఆశ్రయించవచ్చని కూడా సుప్రీం కోర్టు సూచించింది.
నిజానికి మోదీ ప్రధాని కాకముందు ఈ చట్టం దేశంలో దుర్వినియోగమవుతోందని తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని గతంలో ప్రకటించారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ చట్టం రద్దు చేసేందుకు సుముఖత చూపించడం లేదని, పైగా వారి హయాంలో ఇది మరింత దుర్వినియోగం అవుతోందని విపక్షాలతోపాటు ప్రజా సంఘాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. కాగా పలు రాష్ట్రాల్లో అధికార పక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మీడియా ప్రతినిధుల పైన, సంస్థల పైన కూడా ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీం మధ్యంతర ఉత్తర్వులపై ప్రజా సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
అయితే దేశ భద్రతకు పెను ప్రమాదమైన ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు ఈ చట్టం ఉండాల్సిందేనన్నది బీజేపీ వర్గాల వాదనగా ఉంది. సుప్రీం ఉత్వర్వుల నేపథ్యంలో రాజ్యాంగ సంస్థలకు లక్ష్మణ రేఖ ఉందని గుర్తించాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించడం తదుపరి పరిణామాలపై ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం.