దేశంలో ఆదివారం తొలి మంకీపాక్స్ మరణం నమోదయింది. కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లా పున్నియార్‌లో 22 ఏళ్ల యువకుడు మంకీ పాక్స్ వైరస్‌తో బాధపడుతూ చనిపోయాడు. కేరళ వైద్యశాఖ మంత్రి వీనా జార్జ్ ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. వైరస్ బారిన పడి చనిపోయిన యువకుడు ఈనెల 22న యూఏఈ నుంచి స్వస్థలానికి వచ్చాడు. ఇక్కడికి రావడానికి ముందే పరీక్షలు నిర్వహించగా.. అక్కడే మంకీపాక్స్ నిర్ధారణ అయ్యిందని మంత్రి వెల్లడించారు.
కాగా మంకీపాక్స్ కేసుల పరిస్థితిని తెలుసుకునేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. ఈ మరణానికి సంబంధించిన రిపోర్టు అలప్పూజలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి రావాల్సి ఉంది.దేశంలో ఇప్పటివరకు మొత్తం నాలుగు మంకీపాక్స్ కేసులు గుర్తించగా అందులో మూడు కేరళలోనే నమోదయ్యాయి. నిజానికి మంకీ పాక్స్ ప్రాణాంతక వ్యాధి కాదని వైద్య నిపుణులు చెపుతుండగా ఆ వైరస్ సోకినట్టు చెబుతున్న బాధితుడు ప్రాణాలు కోల్పోవడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.