ఇప్పటిదాకా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో మార్కెట్ లీడర్‌గా ఉన్న అమెరికన్ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు, దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యూందాయ్ మోటార్స్ నుంచి గట్టి పోటీ ఎదురవబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు అంతకంతకూ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్న హ్యూందాయ్ కంపెనీ అయోనిక్6 పేరుతో ఓ సెడాన్ కారును గురువారం ఆవిష్కరించింది. ఈ కంపెనీ తయారు చేసిన మొట్టమొదటి సెడాన్ కారు ఇదే కావడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి వ్యక్తమవుతోంది. టెస్లాకు చెందిన మోడల్3 కూడా సెడాన్ సెగ్మెంట్ కారే కావడంతో దీనికి అయోనిక్6 గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని వాహన పరిశ్రమ వర్గాలు చెపుతున్నాయి.
పలు అత్యాధునిక ఫీచర్లతో బయటకు వచ్చిన ఈ కారుని ఒక్కసారి ఛార్జి చేస్తే 610 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ చెపుతోంది. 800 వోల్టుల ఆల్ట్రా ఫాస్ట్ బ్యాటరీ సిస్టమ్ కలిగిఉన్న ఈ కారు 80 శాతం ఛార్జింగ్‌కు కేవలం 18 నిమిషాలు మాత్రమే తీసుకుంటుందట. గంటకు 185 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ కారులో దూసుకుపోవచ్చు. కొరియన్ మార్కెట్లో దీని ధర 55 మిలియన్ వోన్లుగా కంపెనీ తెలిపింది. అంటే సుమారు 42 వేల అమెరికన్ డాలర్లన్నమాట.