భారీ వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి . వారం , పది రోజుల వ్యవధిలోనే వరుసగా రెండోసారి రాష్ట్రాన్ని భారీ వర్షాలు వెంటాడుతున్నాయి .
తిరుమల వీఐపీ దర్శనాల కోసం వేచి ఉన్న భక్తులపైనే భారీ వర్షాల ఎఫెక్ట్ పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులతో సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 15న సిఫార్సు లేఖలు అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. టీటీడీ చరిత్రలో వర్షాల కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేయడం ఇదే మొదటి సారి అని భావిస్తున్నారు. భక్తులకు వసతి, దర్శనం, ప్రసాదాలకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున నిఘా ఉంచాలని, జేసీబీలు, అంబులెన్స్ లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని తెలిపారు. అలాగే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఈవో ఆదేశించారు.