Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నూతన పరదాలు సిద్దం

పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు నూతన పరదాలు సిద్దం అయ్యాయి.ఈ నూతన పరదాలను అత్యంత భక్తిశ్రద్దలతో శ్రీ వేంకటేశ్వరస్వామి మాలధారణ ధరించి సిద్ధం చేస్తారు. తండ్రి.. గోవిందా అంటూ శ్రీవారి పట్ల తనకు ఉన్న అచంచలమైన భక్తిభావంతో తిరుపతికి చెందిన వాసు టైలర్స్ అధినేత మేకల సుబ్రమణ్యం ప్రతి ఏటా శ్రీవారి ఆలయంలో జరిగే నాలుగు పర్వదినాల్లో ఈ నూతన పరదాలు సమర్పిస్తుంటారు. ఉగాది ఆస్థానం, ఆణివార ఆస్థానం, శ్రీవారిబ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు శ్రీవారు కొలువైన ఆనందనిలయంలోని ద్వారాలకు ఈ నూతన పరదాలు తయారు చేసి స్వామి వారికి ఉచితంగా అందిస్తారు. స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో మంగళవారం (అక్టోబర్ 01 వ తేదీ) జరిగే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమంలో ఆలయం శుద్ది తర్వాత నూతనంగా సిద్దం చేసిన ఈ నూతన పరదాలును శ్రీవారి ఆలయంలో జయవిజయులు ఉండే బంగారు వాకిలి, స్వామివారు పవలింపు జరిపే రాములవారిమేడ, శ్రీవారి దివ్యమంగళ రూపం ముందు ఉన్న మొదటి గడప కులశేఖర పడి వద్ద ఈ నూతన పరదాలు అలంకరిస్తారు. రేపు (మంగళవారం) ఉదయం మేకల సుబ్రమణ్యం @ పరదాలు మణి తిరుపతి నుంచి శ్రీవారి మెట్ల మార్గం గుండా తిరుమలకు నడుచుకుంటూ వెళ్లి, పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరించి ఆ తర్వాత స్వామివారి ఆలయంలో ఈ నూతన పరదాలు సమర్పించనున్నారు.