‘ ఏ పంట పండించినా కిలో ఏభై, వందో వస్తుంది. మహా అయితే లక్షణ ఫలం లాంటి మెడికేటెడ్ ఫ్రూట్ అయితే కిలో వెయ్యి వరకు రావచ్చు. కానీ హిమాచల్ ప్రదేశ్ కుల్లూకు చెందిన గౌరవ్ శర్మ అనే రైతు (ప్రయోగాత్మక సాగు చేస్తుంటారు) కేవలం హిమాలయాల్లో మాత్రమే లభ్యమయ్యే అరుదైన మూలిక.. కీడా జడీ ని ఇంట్లో ప్రయోగశాలలో పండించి కిలో 25 లక్షలకు విక్రయిస్తున్నారు..’
ఏంటీ కీడా జడీ?
కీడా జడీ అనేది ఓ రకమైన అడవి పుట్టగొడుగు. సాంకేతిక నామం కార్డీసెప్స్ మిలిటారిస్. చూసేందుకు గొంగళి పురుగులా ఉంటుందని ఆంగ్లంలో క్యాటర్‌పిల్లర్ ఫంగస్ అంటారు. ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో సముద్ర మట్టానికి 3,600-5000 మీటర్ల ఎత్తులో మాత్రమే అత్యంత అరుదుగా కనిపిస్తుంది.
కీడా జడీకి వైద్యపరంగా ఎంతో ప్రాధాన్యముంది. ఈ మూలిక.. రోగ నిరోధక శక్తిని బాగా పెంచగలదని చెబుతారు. లైంగిక సామర్థ్యాన్ని పెంచే సహజసిద్ధమైన స్టెరాయిడ్లా పనిచేస్తుందని అంటారు. అందుకే దీనిని హిమాలయన్ వయాగ్రా అని పిలుస్తారు. క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధుల చికిత్సలోనూ కీడా జడీ ప్రభావవంతంగా పనిచేస్తుందన్నది నిపుణుల మాట. ఆయుర్వేదంలో.. శ్వాస, కిడ్నీ సంబంధిత వ్యాధుల చికిత్సలో ఈ కీడా జడీని ఉపయోగిస్తారు.
ఫ్రెండ్ సలహాతో..
మలేసియాలో ఉండే ఓ స్నేహితుడి ద్వారా కీడా జడీ గురించి తెలుసుకున్నాడు కుల్లూలో ఉండే గౌరవ్ శర్మ. క్రమంగా ఆ మూలిక గురించి అధ్యయనం చేశాడు. ఇంట్లోనే ఓ ల్యాబ్ ఏర్పాటు చేసి.. ఏడాదిన్నరపాటు రకరకాల ప్రయోగాలు చేశాడు. అతడి శ్రమ ఫలించింది. 45 రోజుల్లో కీడా జడీ పంట చేతికొచ్చింది. తొలి దశలో మొత్తం 3 వేల పెట్టెల సరకు అమ్మకానికి సిద్ధమైంది. బెంగళూరులోని ఓ సంస్థకు ఈ మూలికలన్నింటినీ విక్రయించడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆసక్తి ఉన్న రైతులకూ ఈ మూలిక సాగుపై శిక్షణ ఇస్తాను.. అని గౌరవ్ శర్మ చెపుతున్నారు.