ప్రపంచంలో లక్ష కోట్ల డాలర్ల
మార్కెట్ విలువను కోల్పోయిన ఏకైక సంస్థ
అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సంపద హరతి కర్పూరంలా అత్యంత వేగంగా కరిగిపోతోంది. ఏడాది కాలంలో కంపెనీ లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.82 లక్షల కోట్లు) మార్కెట్ విలువను కోల్పోయింది. ప్రపంచంలో లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ను చేజార్చుకున్న తొలి లిస్టెడ్ కంపెనీ ఇదే. 2021 జూలైలో ఆల్‌టైం రికార్డు స్థాయి 1.88 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్న అమెజాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్.. ఈ నెల 9 (బుధవారం) నాటికి 87,900 కోట్ల డాలర్లకు పడిపోయింది. అమెరికాలో ధరలు 40 ఏళ్లకు పైగా రికార్డు స్థాయికి పెరగడం, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో కంపెనీ పనితీరు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడంతో అమెజాన్ షేర్లు ఈ ఏడాదిలో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవడం ఇందుకు కారణమైంది. ఆర్థిక మాంద్యం భయాలు టెక్నాలజీ రంగ షేర్లపై ఇన్వెస్టర్లలో విముఖతను మరింత పెంచాయి.
అమెరికాకు చెందిన మరో టెక్నాలజీ కంపెనీ, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తయారీదారు మైక్రోసా్ఫ్టదీ దాదాపు ఇదే పరిస్థితి. గత ఏడాది నవంబరులో సరికొత్త రికార్డు స్థాయికి పెరిగిన మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్.. గడిచిన ఏడాది కాలంలో 88,900 కోట్ల డాలర్ల మేర హరించుకుపోయింది. ఆదాయం పరంగా అమెరికాలోని 5 అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలు ఈ ఏడాదిలో దాదాపు 4 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ సంపదను కోల్పోయాయి.