తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వర్షాలు దంచికొడుతున్నాయ్. తెలంగాణలో వడగళ్ల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎండలు కాయాల్సిన మార్చి నెలలో అకాల వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి. అదీ ఒకటి, రెండు రోజులు కాదు.. వారం రోజులుగా ఉభయ రాష్ట్రాలలో కుండపోతగా కురుస్తున్న వానలపై వాతావరణ శాఖ ఏం చెబుతుంది ..?
కొద్ది రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పులు చూస్తుంటే ప్రస్తుతం వర్షాకాలం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చలికాలం ముగిశాక.. వేసవికాలం రాకుండా నేరుగా వర్షాకాలం వచ్చేసినట్లు అనిపిస్తోంది. గత ఐదారు రోజులుగా వానలు అంతలా దంచి కొడుతున్నాయి. అది కూడా సాధారణ వర్షాలు కాదు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన కుండపోత వర్షాలు. వాతావరణంలో వచ్చిన అకాల మార్పులు కారణంగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ తదితర నగరాలలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రాబోయే రెండ్రోజులలో ..
యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఉత్తర, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఉత్తర కోస్తాంధ్ర, యానంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అకాల వర్షాలతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. వడగళ్ల వానల వల్ల పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. మామిడి, మిర్చి, అపరాల పంటలు దెబ్బ తిన్నాయి. ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు పడతాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉగాది సమయంలో అకాల వర్షాలు ఎన్నడూ లేవని రైతులు అంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో వ్యవసాయ రంగం మరింత సంక్షోభంలోకి వెళ్లిపోయే ప్రమాదం పొంచి ఉందని రైతాంగం ఆందోనళ వ్యక్తం చేస్తోంది.
తెలంగాణలో :: మరో రెండురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కర్ణాటక నుంచి పశ్చిమ విదర్భ వరకూ మహారాష్ట్ర మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే 24 గంటల్లో ఆదిలాబాద్ ,మంచిర్యాల, పెద్దపల్లి, జయశకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రైతాంగాన్ని ఆదుకోవాలి: ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మిర్చి రైతులు… ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మామిడి, పొగాకు, మొక్కజొన్న రైతులు… ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఉద్యాన పంటల రైతులు… నెల్లూరు జిల్లాలో వరి రైతులు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారని జనసేన అధినేత పవన్వి కళ్యాణ్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో అరటి, మొక్కజొన్న, కర్బూజ, బొప్పాయి పంటలు కూడా దెబ్బతిన్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం వీరికి తక్షణమే ఆర్థికసాయం, పంట నష్టపరిహారాన్ని అందించాలని జనసేనాని విజ్ఞప్తి చేశారు.