ఏపీలోని భీమవరంలో రేపు ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు. ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆయన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అందులో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి బంధువులు, సంబంధీకులతో భేటీ అవుతారు. అల్లూరి సోదరుడు, సోదరి మనవలు, సైన్యంలోని కీలక వ్యక్తులకు చెందిన మనవలు, మునిమనవళ్లు మొత్తం 37 మందిని అధికారులు గుర్తించారు. అయితే వారిని ప్రధాని సభా వేదికపై ఆహ్వానించడంలేదు. భద్రతా చర్యలే అందుకు కారణమని చెబుతున్నారు. కాబట్టి ప్రధాని వారిని ప్రత్యేకంగా కలవనున్నారు. వేదికపై ప్రధాని మోదీతోపాటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి రోజా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రఘురామ కృష్ణరాజు తదితరులు ఉంటారు.