ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా సోమవారం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోపాటు మెగా స్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. వాస్తవానికి రాజకీయాలకు అతీతంగా క్షత్రియ సామాజికవర్గం సౌజన్యంతో జరిగేలా నిర్ణయించిన ఈ కార్యక్రమం చివరకు పూర్తిస్థాయి రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ వస్తున్న కారణంగా బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆహ్వానం లభిస్తుందని, ఆయన దీనికి హాజరయ్యే అవకాశం ఉందని పలువురు భావించారు.
అయితే దీనికి భిన్నంగా రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటూ తన మానాన మళ్లీ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న చిరంజీవిని బీజేపీ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానించడం, ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకావడం రాజకీయంగా పలు రకాల చర్చకు దారి తీసింది. నిజానికి అల్లూరి సీతారామరాజు లాంటి త్యాగధనులను ఏ ఒక్క కులానికో వర్గానికో పరిమితం చేసి చూడకూడదు. ఆయన దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు. ఆయనను గౌరవించుకునే కార్యక్రమాలను రాజకీయం చేయడం కూడా సరికాదు. ఆ రకంగా చూస్తే చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరుకావడం వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యాలు ఉన్నాయనుకోలేం. అయితే ప్రధాని మోదీ హాజరైన ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమానికి బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత హాజరుకాకపోవడం మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమేనన్న వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
నిజానికి పవన్‌కల్యాణ్ గత ఎన్నికల్లోనే తొలిసారిగా జనసేన తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఆయన విశాఖ జిల్లాలోని గాజువాకతో పాటు, భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. రెండుచోట్ల ఓటమి చవిచూశారు. అయితే భీమవరంలో గట్టి పోటీ ఇచ్చిన ఆయన స్వల్ప తేడాతోనే పరాజయం పాలయ్యారు. ఆ రకంగా పవన్‌కల్యాణ్‌కు భీమవరంతో మంచి అనుబంధమే ఉంది. ఇంకా చెప్పాలంటే ఆయన సొంత జిల్లా కూడా ఇది. పవన్‌కల్యాణ్ సామాజిక వర్గం అత్యధికంగా ఉండే ప్రాంతం కూడా కావడంతో ఈ కార్యక్రమానికి పవన్‌కల్యాణ్ కూడా హాజరై ఉంటే అది ప్రజల్లోకి మంచి మెసేజ్‌ను పంపినట్టుండేది. అటు బీజేపీకి, ఇటు జనసేనకు కూడా మేలు చేసి ఉండేది. కానీ పవన్‌కల్యాణ్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండటంతో ఈ రెండు రాజకీయ పార్టీల మధ్య దూరం పెరుగుతుందా.. అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.
మరోపక్క అనూహ్యంగా చిరంజీవి ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో పవన్ బీజేపీకి దూరమైతే చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానించి ఆ లోటు పూడ్చుకునే ప్రయత్నంలో ఆ పార్టీ ఉందన్న విశ్లేషణలూ వెలువడుతున్నాయి. ఏదేమైనా సౌమ్యుడు, అజాతశత్రువుగా ఉండే చిరంజీవికి అటు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోపాటు ఇటు ప్రధాని మోదీతోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. వేదిక మీద చిరంజీవిని ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి గౌరవించడం, ఆ తరువాత చిరంజీవితో ప్రధాని మోదీ ఆత్మీయంగా చర్చించడం కనిపించింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని గతంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఆ పార్టీ తరపున కేంద్ర సహాయ మంత్రిగా కూడా పని చేసినా ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. మరి తాజా పరిణామాల నేపథ్యంలో చిరు మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా..? ఇస్తే అది వైసీపీ తరపునా.. లేక బీజేపీ తరపునా.. అన్న చర్చలు మాత్రం ఇప్పుడు అటు ప్రజల్లోనూ ఇటు మీడియాలోనూ గట్టిగానే జరుగుతున్నాయి.