ఇటీవలి కాలంలో తరచుగా తెలంగాణ సీఎం కేసీఆర్ సహా ఆ రాష్ట్ర మంత్రులు సైతం ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో ఏపీ ప్రస్తావన తేవడం, ఇక్కడి పరిస్థితులతో పోల్చి తెలంగాణ ఎంతో మెరుగైన స్థితిలో ఉందని చెప్పడం ఆనవాయితీగా మారిపోయింది. ప్రజల్లో తమకున్న ఆదరణను నిలుపుకోవడం కోసమో, పెంచుకోవడం కోసమో వారి ప్రభుత్వాన్ని పొగుడుకోవడంలో తప్పులేదు. కాని, అవసరం ఉన్నా లేకున్నా ఏపీ గురించి చులకనగా మాట్లాడటం మాత్రం ఏమాత్రం సమర్థనీయం కాదు. అని వైసీపీ మంత్రులు రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి గతంలో మాదిరిగా కాకుండా ఏపీ మంత్రుల నుంచి గట్టి కౌంటర్‌లే పడ్డాయి.
ఇంతకీ కేటీఆర్ ఏమన్నారంటే..
క్రెడాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను శుక్రవారం ఉదయం ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలల్లోనే సీఎం కేసీఆర్ తీసుకున్న సమర్థవంతమైన చర్యలతో విద్యుత్ కొరతను అధిగమించామని, గృహాలకు, పరిశ్రమలకు, వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. అంతటితో ఆగకుండా పక్కన ఉన్న ఏపీలో విద్యుత్ సరఫరా, రోడ్లు, నీటి సరఫరా పరిస్థితి అధ్వానంగా ఉందని.. అక్కడి నుంచి వచ్చిన తన మిత్రులు చెపుతున్నారని, సొంత ఊరు నుంచి హైదరాబాద్ కు వచ్చాక ఊపిరి పీల్చుకున్నామని వారు చెప్పినట్టు కేటీఆర్ తెలిపారు. అనుమానముంటే ఏపీకి వెళ్లి పరిస్థితులు చూసి వస్తే తెలంగాణ ఎంత మెరుగ్గా ఉందో అర్థమవుతుందని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యాఖ్యలు వెనుక మర్మమేమిటి? చాలా కాలం వైసీపీ, జగన్ లకు వత్తాసు పలుకుతూ వస్తున్న టీఆర్ఎస్ ఎందుకు వీళ్లపై కౌంటర్లు మొదలుపెట్టారు? ఆంధ్రను పోలిస్తే తాము చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తిస్తారన్న బలమైన కారణంగానే ఇలా చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఏపీ మంత్రుల కౌంటర్
ఏపీలో పరిస్థితుల గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఘాటుగా స్పందించారు. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎవరో మిత్రులు చెప్పారంటూ పక్క రాష్ట్రం గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో అసలు విద్యుత్ సరఫరాయే ఉండటం లేదని, తాను స్వయంగా అక్కడి పరిస్థితి చూసి చెపుతున్నానని, బాధ్యత కలిగిన వ్యక్తులు అలా మాట్లాడకూడదని కేటీఆర్‌కు బొత్స హితవు పలికారు.
ఇక మరో మంత్రి అమర్‌నాథ్ మాట్లాడుతూ ఎక్కడో ఉండి ఏదో మాట్లాడటం కాదని, ఏపీ వచ్చి స్వయంగా చూసి మాట్లాడాలని, 4 బస్సుల్లో కాదు.. 400 బస్సుల్లో రావాలని కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఏపీలోనే కాక ఇంకా 16 రాష్ట్రాల్లో విద్యుత్ కోతలున్నాయని, వాటిలో తెలంగాణ కూడా ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి టీఆర్ఎస్ నాయకుల ఘనత కాదని, ఉమ్మడి రాష్ట్రంలో నగరాభివృద్ధి జరిగిందని గుర్తుంచుకోవాలన్నారు. దమ్ముంటే జగన్ పాలనతో పోటీ పడాలని సవాల్ విసిరారు.
ఇక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరో మంత్రి ఆర్‌కే రోజా కూడా కేటీఆర్ వ్యాఖ్యలను గట్టిగా ఖండించారు. పక్కవాళ్లను కించపరచే వ్యాఖ్యలతో ఓట్లు సంపాదించాలనుకోవడం మూర్ఖత్వమని, తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కారణంగానే టీఆర్ఎస్ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి రోజా కూడా కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా కేటీఆర్‌ను ఆంధ్రాకు రావాలని ఆహ్వానిస్తున్నట్టు ఆమె తెలిపారు. విశేషమేమిటంటే ఏపీ మంత్రి రోజా హైదరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసివచ్చి, అక్కడే విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి వచ్చాక తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశీర్వాదం కోసం తాను ఆయనను కలిసినట్టు ఆమె తెలిపారు.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు టీవీల్లోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతమైన ప్రచారం లభించడంతో వైసీపీ ప్రభుత్వం వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే వరుసగా మంత్రులు కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు జారీ చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ అంశంపై స్పందిస్తూ కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. అయితే తెలంగాణ మంత్రులు కొందరు వీరి మాటలకు ప్రతిస్పందిస్తూ కేటీఆర్ ఉన్న వాస్తవాన్నే ప్రస్తావించారని, ఆయన అన్నదాంట్లో తప్పేముందని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఏదేమైనా టీఆర్ఎస్ నేతలు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు సామాన్య ఏపీ ప్రజలకు కూడా బాధ కలిగిస్తున్నాయన్నది వాస్తవం. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ కు చెందిన నేతలు ఇలా మాట్లాడటం వారికి శోభనివ్వదు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆంధ్రులపై నిరంతరం విద్వేష పూరిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చినా అది వారి లక్ష్య సాధన కోసం ఎంచుకున్న మార్గంగా ఏపీ ప్రజలు సరిపెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.