ఏపీ మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పొంగూరు నారాయణను ఆంధ్రప్రదేశ్ సీఐడి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీపై చిత్తూరులో నమోదైన కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న నారాయణ నివాసంలో ఆయనను అరెస్టు చేసిన పోలీసులు ఆయనను అక్కడినుంచి చిత్తూరుకు తరలించారు. నారాయణ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడంతోపాటు మాజీ ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లోనూ, కృష్ణా జిల్లా మండవల్లి లోనూ మాల్ ప్రాక్టీస్ నిరోదక చట్టం 408 ఐపిసి కింద నారాయణ విద్యాసంస్థలపై ఇటీవల పలు కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి ఇప్పటికే 15 మంది అధ్యాపకులను పోలీసులు అరెస్టు చేయగా వారికి కోర్టు బెయిల్ ఇచ్చింది. నెల్లూరు, అనంతపురం, కృష్ణా జిల్లాలో కూడా నమోదైన కేసులన్నింటిపైనా విచారణ జరుపుతున్న సీఐడి దర్యాప్తులో భాగంగా నారాయణను అరెస్టు చేసినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్‌లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కూడా ఏపీ సీఐడీ పలువురిపై కేసులు నమోదు చేసింది. గత నెల 27న వచ్చిన ఫిర్యాదుపై ఈ నెల 6న దర్యాప్తు చేపట్టిన సీఐడీ ఈ కేసులో ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నట్టుగా నిర్ధారణకు వచ్చినట్టు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఏ-1గా, నారాయణను ఏ-2గా చేర్చగా, పలు రియల్ ఎస్టేట్ కంపెనీల పైనా కేసు నమోదు చేసినట్టు సమాచారం.
నారాయణ అరెస్టుతో పాటు మాజీ సీఎం పైనా కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా, రాజకీయ కక్షతోనే చేస్తోందని టీడీపీ నేతలు విమర్శలతో విరుచుకుపడుతుండటంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. అయితే తప్పు చేసినవారెవరూ తప్పించుకోలేరని, చట్టం తనపని తాను చేసుకుపోతుందని మంత్రులు ప్రకటించారు.