ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి న్యాయస్థానంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్‌గా గత ప్రభుత్వ హయాంలో పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావుపై ప్రస్తుత ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ను కొనసాగించడం కుదరదని తేల్చి చెప్పింది. ఆయనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది. రెండేళ్ల సస్పెన్షన్ ఈ ఏడాది ఫిబ్రవరి 7 వ తేదీతో ముగిసినందున ఆ రోజునుంచి ఆయనకు అన్నిరకాల ప్రయోజనాలు వర్తిస్తాయని కూడా కోర్టు స్పష్టం చేసింది.
సస్పెన్షన్ కు నేపథ్యం ఇదీ..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలు అతిక్రమించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తూ ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో భద్రతా ఉపకరణాల కొనుగోలుకు సంబంధించి ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలు పాటించలేదని, ఆ కారణంగానే ఆయనపై వేటు వేస్తున్నట్టు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, తనపై ఆరోపణలు అసత్యమని ఏబీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయం వెనుక ఎలాంటి ఆధారాలు, హేతుబద్ధత లేదని పేర్కొంటూ 2020 మే 22న ఏబీపై సస్పెన్షన్ చెల్లదని తీర్పు ఇచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం ఈ అంశాన్ని అక్కడితో వదిలిపెట్టకుండా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లింది. గురువారం కేసును విచారించిన సుప్రీం ధర్మాసనం రెండేళ్లకు పైగా సస్పెన్షన్ను కొనసాగించకూడదన్న నిబంధనను ప్రస్తావిస్తూ, సస్పెన్షన్‌ను పొడిగించేందుకు తగిన ఆధారాలు, నివేదికను శుక్రవారం లోగా కోర్టుకు సమర్పించాలని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులను ఆదేశించింది. శుక్రవారం కూడా కొనసాగిన విచారణలో ఏపీ ప్రభుత్వం తరపున ఇచ్చిన నివేదికలో తాము కోరిన వివరాలకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో, మరింత గడువు కావాలని కోరిన ఏపీ ప్రభుత్వ న్యాయవాదుల వినతిని తోసిపుచ్చి, గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తుది తీర్పు వెలువరించింది.
తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ సర్కారుపై నిప్పులు కురిపించిన ఏబీ
ప్రభుత్వం తనపై అసత్య ఆరోపణలతో వేధిస్తోందంటూ.. ఇప్పటిదాకా ఒంటరిగా న్యాయపోరాటం చేస్తూ వచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం తీరును తీవ్రంగా ఎండగట్టారు. ‘ఏ బావ కళ్లల్లో ఆనందం కోసం, ఏ సైకో సంతోషం కోసం తనను సస్పెండ్ చేసి వేధిస్తూ ఇదంతా చేశారని, అసలు కొనుగోళ్లే జరగని అంశంలో అవినీతి ఎలా జరుగుతుందని సూటిగా ప్రశ్నించారు. తన సస్పెన్షన్ అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసిందని, ప్రభుత్వ చర్య చట్ట విరుద్ధమని, నిర్హేతుకమని, అది ఏకపక్షంగా తీసుకన్న నిర్ణయమని తేల్చి చెప్పిందని ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సీపీ ఆర్వో పూడి శ్రీహరి తనపై చేసిన విషప్రచారాన్ని కూడా ఏబీ ఈ సందర్బంగా ప్రస్తావించారు. మానసికంగా తాను దృఢంగానే ఉన్నానని కూడా ఆయన వెంకటేశ్వరరావు తెలిపారు.
కోర్టు ఖర్చులను బాధ్యుల నుంచే వసూలు చేయాలి..
ఒక డీజీపీ ఇచ్చిన ఫోర్జరీ మెమో ఆధారంగా ఒక ఏడీజీ సీఐడీ తయారు చేసిన తప్పుడు రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం లోని ప్రముఖులు, చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారులు ఏమీ చూడకుండానే సంతకాలు పెట్టి 24 గంటల్లో తనపై సస్పెన్షన్ ఆర్డర్ రెడీ చేశారని, దీనిని ఇప్పటిదాకా పొడిగించుకుంటూ వచ్చారని ఏబీ తెలిపారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన అధికారుల వివరాలను ససాక్ష్యంగా ప్రభుత్వానికి నివేదించినా వారిపై చర్యలేమీ తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు నిరూపించేందుకు ఇప్పటిదాకా ప్రభుత్వం లక్షలాది రూపాయలు వ్యయం చేసిందని, ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చిన అధికారుల నుంచే ఈ సొమ్మును రికవరీ చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు సూచించారు. ప్రభుత్వాలు, చీఫ్ సెక్రటరీలు వస్తుంటారు.. పోతుంటారని, ప్రజలు, వ్యవస్థలు శాశ్వతమని, అంతిమంగా న్యాయం, ధర్మం గెలుస్తాయని గుర్తించాలన్నారు. ‘నేను లోకల్.. అన్యాయంగా నన్ను ఇబ్బంది పెట్టినవారిని ఎవరినీ వదిలిపెట్టను..’ అంటూ ఏబీ హెచ్చరించారు.